హారికకు రాత్రి 9 గంటలు దాటితే ఒకే ఒక మెసేజ్ వస్తుంది.
“నువ్వు సేఫ్‌గా ఉన్నావా?”
నెంబర్ సేవ్ చేసుకోవడానికి అవకాశం లేదు, ఎప్పుడు కాల్ చేసిన స్విచ్ ఆఫ్ అనే వస్తుంది. కొన్ని రోజులు అలానే గడిపింది. తర్వాత అదే అలవాటైంది. ఇప్పుడు ఆ మెసేజ్ లేకుండా ఆమెకు నిద్ర పట్టదు.
జరిగిన కథ
ఆరు నెలల క్రితం, ఒకరోజు సాయంత్రం బస్ స్టాప్ లో చుట్టూ జనాలతో చాలా రద్దీగా ఉంది. వాహనాల శబ్దం, హార్న్‌లతో ఆ ప్రదేశం అంతా గోల గోలగా ఉంది. హారిక తన బస్ కోసం ఎదురుచూస్తూ ఫోన్‌లో చూస్తూ ఉంది. కొంచం సేపటి తర్వాత బస్ వచ్చింది. బస్సు వచ్చిన తక్షణమే ఎక్కి కూర్చుంది. బస్సు దిగి ఇంటికి చేరుకున్నాక ఒక్కసారిగా ఆమెకు ఏదో గుర్తొచ్చింది.
“అయ్యో నా పర్స్…?”
బ్యాగ్ మొత్తం వెతికింది… ఎక్కడా తన పర్సు కనిపించలేదు. వెంటనే బయటకు వెళ్లి చూసింది. అక్కడ కూడా కనిపించలేదు. ఇంకా కొంచం వెనక్కి వెళ్లి చూడాలని అనుకుంది కానీ అప్పటికే చీకటిపడిపోయింది. తనేమో ఆందోళనలో పడిపోయింది. ఎందుకంటే ఆ పర్సులో ఉన్నది డబ్బులు మాత్రమే కాదు. ముఖ్యమైన కార్డులు కూడా ఉన్నాయి. అదే ఆలోచనతో ఆ రాత్రంతా తనకు నిద్ర కూడా సరిగ్గా పట్టలేదు.
తరువాతి రోజు త్వరగా రెడీ అయ్యి మళ్లీ అదే బస్ స్టాప్‌కు వచ్చింది. ఎక్కడైనా దొరుకుతుందేమో అని చుట్టూ చూస్తోంది. కానీ ఎక్కడా కనిపించలేదు.
అప్పుడే
“ఇది మీదేనా?” అంటూ వెనుక నుంచి ఒక మృదువైన గొంతు వినిపించింది. హారిక తిరిగి చూసింది. చూసిన వెంటనే ఒక తన ముందు ఒక అబ్బాయి నించుని ఉన్నాడు. ఆమె ముందుకు వచ్చి తన చేతిలో ఉన్న ఒక పర్స్ ను చాపాడు. అది చూసిన వెంటనే ఆమె కళ్లలో ఆనందం కనిపించింది.“అవును! ఇది నా పర్సె!” అని ఆనందంగా చెప్పింది. “నిన్న బస్ స్టాప్ దగ్గర మీరు హడావిడిగా బస్సు ఎక్కుతున్నప్పుడు పర్స్ పడిపోయింది… వెంటనే నేను దాన్ని తీసుకుని మీకు ఇద్దాం అని పిలిచాను, కానీ అంతలోనే బస్సు వెళ్ళిపోయింది. రేపు మళ్ళీ ఇక్కడికి వస్తే ఇద్దామని అనుకున్నాను. దానికోసమే నేను ఇక్కడికి వచ్చాను. ఎలాగో మీరు నాకు కనిపించారు. అని అన్నాడు నవ్వుతూ.
“థాంక్యూ మీకు చాలా…” అని హారిక కృతజ్ఞతతో చెప్పింది. అతను కూడా "పర్లేదు, నా పేరు అద్వైత్.” అని చెప్పాడు. ఆమె కూడా "నేను హారిక,” అని చెప్పింది. అలా వారిద్దరూ చిన్నగా పరిచయం చేసుకుంటూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. కొంచం సేపు ఇద్దరూ అలానే మాట్లాడుకున్నారు. మీది ఏ ఊరు, ఏమి చేస్తున్నారు అని మాట్లాడుతుండగా వారిద్దరి మధ్యన నెమ్మదిగా స్నేహం ఏర్పడింది. అద్వైత్ కూడా రోజూ అదే బస్సుకు వేళ్లేందుకు వారిద్దరూ తరచూ కలుసుకునేవాళ్ళు.
మొదట్లో సాధారణ మాటలే మాట్లాడుకునేవారు. “బస్ వచ్చిందా?", లాంటి చిన్న చిన్న మాటలు మాత్రమే. కానీ రోజులు గడిచే కొద్దీ ఆ మాటలు, చిన్నగా నవ్వులు కూడా పెరిగాయి. ప్రతి రోజు బస్ స్టాప్ వాళ్లకి ఒక ప్రత్యేకమైన ప్రదేశంగా మారింది.
హారిక తన రోజు ఎలా గడిచిందో చెప్పేది… అద్వైత్ ఆసక్తిగా విని, అప్పుడప్పుడూ చిన్నగా నవ్వుతూ ఉండేవాడు. ఇంకా హారిక ఎప్పుడు అద్వైత్ గురించి ఏవి అడిగినా.. ఏవి చెప్పకుండా తప్పించుకునేవాడు. కొన్ని రోజులకు వాళ్లు బస్ కోసం కాదు… ఒకరిని ఒకరు చూడటానికి రావడం మొదలుపెట్టారు.
ఒకరోజు వర్షం పడుతుంటే… ఇద్దరూ ఒకే షెల్టర్ కింద నిలబడి నవ్వుకుంటూ మాట్లాడుకున్నారు. మరోరోజు టీ తాగుతూ చిన్న చిన్న జోక్స్ చెప్పుకున్నారు. ఆ చిన్న చిన్న క్షణాల్లో…
వాళ్ల మధ్య స్నేహం నెమ్మదిగా మరింత దగ్గరైంది. ఆ దగ్గరితనం… వాళ్ళకే తెలియకుండానే ప్రేమగా మారిపోయింది. ఒకరిని ఒకరు చూడకుండా ఒక రోజు గడవడం కూడా కష్టంగా అనిపించేది.
ఒక రోజు హారిక, అనుకోకుండా ‘నువ్వు ఇన్ని రోజులు ఎక్కడుండేవాడివి, ఏమి చేసేవాడివి?’ అని అడిగింది.” అప్పుడు అద్వైత్ ఉన్నట్టుండి నిశ్శబ్దంగా మారిపోయాడు. ఆమె కళ్లలోకి చూసి, వెంటనే తన చూపును తిప్పుకున్నాడు. కొన్ని క్షణాలు ఏమీ మాట్లాడలేదు. హారికకు ఏదో తేడాగా అనిపించింది. “ఏమైంది?” అని అడిగింది.
అద్వైత్ అప్పుడు ఏమీ చెప్పలేదు. కానీ కొన్ని క్షణాల తర్వాత కొంచం లోతుగా శ్వాస తీసుకున్నాడు. అతని ముఖంలో ఒక విచిత్రమైన బాధ కనిపించింది. “నన్ను క్షమించు…” అని నిధనంగా మాట్లాడటం మొదలుపెట్టాడు. “సారీ నన్ను క్షమించు నేను… ఆ విషయం గురించి ఏమి చెప్పలేను. నా గతం గురించి… దయచేసి నన్ను అడగకు.” అని చెప్పాడు.
"కానీ" అంటూ హారిక ఏమో చెప్పాలని వస్తుంటే అంతలో అద్వైత్ “కొన్ని విషయాలు చెప్పలేనివి…చెప్పకూడనివి కూడా ఉంటాయి. నువ్వు నన్ను నమ్ముతావా?” అని నెమ్మదిగా అడిగాడు. అంతే ఇక హారిక ఇంకేమి మాట్లాడలేకపోయింది. తర్వాత అతని మాటలను నమ్మి, మరేం అడగకుండా ఒప్పుకుంది. "సరేలే నేనేమి అడగను ప్రేమలో నమ్మకం ఉంటే చాలు" అని చెప్పింది. అద్వైత్ "ఇక నేను బయలుదేరుతా... ఇంటికి వెళ్లి message చేస్తా" అంటూ ఆత్రంగా వెళ్ళిపోయాడు.
హారిక అప్పుడు తనతో ఒప్పుకున్నా తర్వాత తన మనసులో మాత్రం కొన్ని విషయాలు ఆమెను కలవరపెట్టాయి. "అద్వైత్ ఎప్పుడూ తన ఇంటికి పిలవడు. తన ఫోటోలు తీసేందుకు కూడా అనుమతించేవాడు కాదు. సోషల్ మీడియాలో అసలు లేడు" అని. ఒకరోజు… ఎప్పటిలానే హారిక బస్ స్టాప్‌కి వచ్చింది. కానీ ఆమెకు ఆ రోజు ఏదో ఖాళీగా అనిపించింది.
ఎంత సేపైనా అద్వైత్ రాలేదు ఎక్కడా కనిపించలేదు. “బహుశా ఆలస్యంగా వస్తాడేమో…” అనుకుంది. కొంతసేపు అలాగే వేచి చూసింది. ఒక్కో బస్ వచ్చి వెళ్లిపోతోంది… కానీ అతను మాత్రం రానేలేదు. ఆమె ఫోన్ తీసుకుని కాల్ చేసింది. “Switched Off” అని వచ్చింది. మొదట ఆమెకు పెద్దగా ఏమీ అనిపించలేదు. “బిజీగా ఉంటాడేమో” అని అనుకుంది. కానీ ఆ రోజు మొత్తం అతని నుంచి ఎలాంటి మెసేజ్ రాలేదు. Phone చేయడానికి కూడా లేకుండా switched off అనే వస్తుంది. సాయంత్రం వరకు వేచి చూసి ఆమె ఇంటికి వెళ్ళిపోయింది. తరువాతి రోజు చూసింది అప్పుడు రాలేదు. దాని తర్వాత రోజు కూడా చూసింది అప్పుడు కూడా రాలేదు.
ఆమె మనసులో ఒక విచిత్రమైన భయం మొదలైంది. “ఏమైంది అతనికి…? ఎక్కడికి వెళ్లిపోయాడు…?” ఆమెకు ఆలోచనలు ఆగలేదు. ఆలోచిస్తూ ఆలోచిస్తూ రోజులు గడుస్తున్నాయి. కానీ అతని గురించి ఏమీ తెలియలేదు. కాలం వెళుతుండగా కొద్ది కొద్దిగా అతని గురించి ఆలోచనలు తగ్గుతూ వచ్చాయి.
కొన్ని రోజుల తర్వాత రాత్రి గడియారం నెమ్మదిగా 9 గంటలు చూపించింది. హారిక అలానే ఫోన్ చూస్తూ కూర్చుంది. అప్పుడే... ఒక మెసేజ్ వచ్చింది. ఆమె ఫోన్ తీసుకుని మెసేజ్ ఓపెన్ చేసి చూసింది.
“నువ్వు సేఫ్‌గా ఉన్నావా?” అది చూసి ఎవరూ ఏంటి అని చూడకుండా వెంటనే message చేసింది. "ఎక్కడున్నావు? ఎలా ఉన్నావు?" అని అడిగింది కానీ అటువైపు నుండి ఏమీ రిప్లై రాలేదు. అప్పుడు హారిక గుండె బలంగా కొట్టుకుంది. కాల్ కట్ అయ్యింది. మళ్ళీ చేస్తే switched off.
అప్పుడు ఆమె ఒక పిచ్చిదానిలా... ఇది అతనే, ఖచ్చితంగా అతనే కానీ ఎందుకు ? రిప్లై చేయడం లేదు. అని ఏడ్చింది. అతనికి ఏమైనా జరిగిండొచ్చా అంటూ అద్వైత్‌తో గడిపిన ప్రతి క్షణాన్ని గుర్తుకు తెచ్చుకుంది. “ఎక్కడైనా ఏదైనా క్లూ మిస్ అయ్యానా…?” అని తనను తాను ప్రశ్నించుకుంది. కానీ అన్ని జ్ఞాపకాలు స్పష్టంగానే ఉన్నాయి. అతని మాటలు, అతని నవ్వు, అతని చూపు అన్నీ నిజంగానే అనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఎందుకు ఇలా అనిపిస్తోంది? ఆమె గుండెల్లో అసహనం పెరిగింది. తెలియని భయం మెల్లగా ఆమెను చుట్టుముట్టింది. ఇంకోసారి ఆ నెంబర్‌కు కాల్ చేసింది. మళ్లీ అదే సమాధానం. “Switched Off.”
“ఇలా ఎంతకాలం వేచి చూస్తాను…? ఇది ఏమిటో ఎలాగైనా తెలుసుకోవాలి…” అని అనుకుంది. తన నెంబర్‌ను ట్రాక్ చేయించాలని వెంటనే పోలీస్ స్టేషన్ కు వెళ్ళింది. ట్రాక్ చేసిన కొన్ని గంటల తర్వాత వచ్చిన సమాధానం… ఆమె ప్రపంచాన్నే కూల్చేసింది. ఈ నెంబర్ ను అసలు పోలీసులు కూడా trace చేయలేకపోయారు. హారిక కళ్ళు పెద్దవయ్యాయి. శ్వాస ఆగిపోయినట్టైంది.
“అద్వైత్… లేడా?” ఆమె మదిలో ఒక్క క్షణం ఆరు నెలల జ్ఞాపకాలు కనిపించాయి. బస్ స్టాప్‌లో మొదటి పరిచయం, ఆ చిరునవ్వు, ఆ మాటలు, ఆ ప్రేమ అవి అన్నీ నిజంగానే జరిగాయా? లేక నా భ్రమ అని తనలో తానే అనుకుంది. కానీ… ఒక ప్రశ్న మాత్రం ఇంకా మిగిలింది. అయితే రాత్రి 9 గంటలకు వచ్చే ఆ మెసేజ్ ఎవరిది? హారిక గుండెల్లో భయం, సందేహం, ప్రేమ… అన్నీ కలిసిపోయాయి. ప్రేమ… నిజమా? లేదా… అది ఒక నీడ మాత్రమేనా
Part-2
ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ పోతుంది.
- అద్వైత్ ఒక భ్రమ లేదా నిజామా?
- ఎందుకు హారికకు దగ్గరయ్యాడు?
- రోజూ ఆ message ఎందుకు వస్తుంది?

Comments
Post a Comment