Skip to main content

Episode - 11 ఉమ్మడి కుటుంబం| సుమతి అడుగు – కొత్త ఆశకు నాంది

"వరద వారి పంటను తీసుకెళ్లింది...   అప్పులు వారి నిద్రను దోచుకున్నాయి...   కానీ ఒక చిన్న ఆశ వారి జీవితాన్ని మళ్లీ మార్చబోతోంది.  ఆ ఆశకు మొదటి అడుగు వేసింది సుమతే..." సుమతి అడుగు – కొత్త ఆశకు నాంది సుమతి మాటలు విన్న తర్వాత అక్కడ కొద్దిసేపు నిశ్శబ్దం నెలకొంది. సిద్ధయ్య ఆమె వైపు చూసి మెల్లగా అన్నాడు.  అమ్మా... నీ మనసు ఎంత మంచిదో మాకు తెలుసు. కానీ పొలం పని నిజంగా చాలా కష్టం.  సుమతి మాత్రం వెనక్కి తగ్గలేదు.  మావయ్యా...  మొదట్లో కష్టం అనిపించొచ్చు. కానీ నేర్చుకుంటాను. కుటుంబం కోసం చేసే పని కదా. ఆమె మాటల్లో కనిపించిన నమ్మకం అందరినీ ఆలోచనలో పడేసింది. చివరికి రాములమ్మ చిరునవ్వుతో అంది. "సరే అమ్మా...  నీ ఇష్టం. కానీ ఎక్కువ కష్టపడకూడదు." ఆ మాట విన్న సుమతి ముఖంలో చాలా రోజుల తర్వాత నిజమైన ఆనందం కనిపించింది. మరుసటి రోజు ఉదయం సూర్యుడు ఉదయించకముందే సుమతి లేచింది. ఇంటి పనులు త్వరగా ముగించి సిద్ధయ్యతో కలిసి పొలానికి వెళ్లింది. పొలంలో అడుగుపెట్టగానే ఆమెకు కొత్త ప్రపంచంలోకి వచ్చినట్టుగా అనిపించింది. ఎక్కడ చూసినా తడిసిన నేల... వరద మిగిల్చిన గుర్తులు... ఎండిపో...

“ఆమెతో మాట్లాడింది ఒక ఆత్మనా? 💔😱 | Harika & Advait Love Horror Story Part 2”

“హారిక కథ Part 2 – నీడ వెనుక నిజం | 

ప్రేమ అంటే… ఎప్పుడూ మనతో ఉండడమే కాదు.

కొన్ని సార్లు…
చనిపోయిన తర్వాత కూడా మనల్ని వదలని జ్ఞాపకం.

హారికకి అది ఒక ప్రేమ కాదు…
ఒక రహస్యం… ఒక భయం…

Telugu Love & Horror Story”

ఆ రాత్రి...

     ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. బయట అప్పుడప్పుడు గాలి వీచిన శబ్దం మాత్రమే వినిపిస్తోంది. గడియారం టిక్… టిక్… అని ప్రతి సెకను గట్టిగా వినిపిస్తున్నట్టుగా అనిపించింది.

హారికకు మాత్రం నిద్ర ఏమాత్రం రాలేదు.

ఆమె మంచంపై పడుకుంది… కానీ కళ్ళు మూసుకున్నా కూడా మనసు మాత్రం ఆగలేదు. చివరికి లేచి కూర్చుంది. ఫోన్‌ని చేతిలోకి తీసుకుంది.

స్క్రీన్ వెలుగు ఆమె ముఖంపై పడింది…
ఆ వెలుగులో ఆమె కళ్ళలో కనిపించింది—

  • భయం…
  • అనుమానం…
  • ఇంకా… ఒక తెలియని ఆశ…

“ఈరోజు కూడా మెసేజ్ వస్తుందా…?” అని ఆమె మనసులోనే తానే ప్రశ్నించింది.

ఆమె చూపు గడియారంపై పడింది.

8:57 PM…

గుండె కొంచెం వేగంగా కొట్టుకుంది.

ఆమె చేతులు స్వల్పంగా వణికాయి. ఫోన్‌ని గట్టిగా పట్టుకుంది.

ప్రతి సెకను ఒక నిమిషంలా అనిపించింది.

ఆమెకు ఆ రాత్రి చలి ఎక్కువగా అనిపించింది… కానీ అది గాలివల్ల కాదు… లోపల పెరుగుతున్న భయంవల్ల.

8:59 PM…

ఇప్పుడు గుండె శబ్దమే ఆమెకు స్పష్టంగా వినిపిస్తోంది.

“ఈసారి వస్తే… నేను రిప్లై ఇస్తాను…” అని ఆమె తనలో తాను నిర్ణయించుకుంది.

ఆమె వేలి కీప్యాడ్‌పై సిద్ధంగా ఉంది.

9:00 PM…

గడియారం ఒక్కసారిగా “టన్…” అని కొట్టింది.

ఆ శబ్దం గదిలో మారుమోగింది.

అదే క్షణం—

టింగ్…

ఆ శబ్దం వినగానే హారిక ఒక్కసారిగా గుబులెత్తింది.

ఫోన్ స్క్రీన్‌పై వెలిగిన మెసేజ్‌ని చూసే ముందు…
ఆమె ఒక లోతైన ఊపిరి పీల్చుకుంది.

“ఇదే నిజం చెప్పే క్షణం…”
అని ఆమె మనసు గట్టిగా చెప్పింది.

మెల్లగా…
ఆమె చూపు స్క్రీన్‌పై పడింది

“నువ్వు సేఫ్‌గా ఉన్నావా?”

ఈసారి…
హారిక నిర్ణయం తీసుకుంది.

“ఈరోజు నేను రిప్లై ఇస్తాను…”
చేతులు వణికినా…
టైప్ చేసింది—

“నువ్వెవరు?”

కొన్ని సెకన్లు…
ఎలాంటి రిప్లై లేదు.
ఆమె గుండె మరింత వేగంగా కొట్టుకుంది.

అప్పుడే…
టింగ్…

“నువ్వు నన్ను గుర్తుపట్టలేదా?”

హారిక కళ్ళు పెద్దవయ్యాయి.
“అద్వైత్…?” అని వెంటనే టైప్ చేసింది.

కొన్ని క్షణాల తర్వాత…
“నేను ఎప్పుడూ నీ దగ్గరే ఉన్నాను.”

ఆ మెసేజ్ చూసిన క్షణం…
ఆమె వెన్నులో చలి పరిగెత్తింది.

తరువాతి రోజు…
హారిక నేరుగా బస్ స్టాప్ దగ్గరికి వెళ్లింది.

     ఆ రోజు ఉదయం వెలుతురు ఇంకా పూర్తిగా విరజిమ్మలేదు. ఆకాశం మసకబారిన రంగులో ఉంది…
     గాలిలో ఒక చల్లదనం. రోడ్డు మీద అప్పుడప్పుడు వెళ్తున్న వాహనాల శబ్దం తప్ప… అక్కడ అంతా నిశ్శబ్దంగా అనిపించింది.

ఆ బస్ స్టాప్…
ఆమెకు ఇది కొత్త ప్రదేశం కాదు.
కానీ ఆ రోజు… అది పూర్తిగా భిన్నంగా అనిపించింది.

ఆమె నెమ్మదిగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్లింది.
అదే బెంచ్…
అదే స్తంభం…
అదే రోడ్డు…

అన్నీ అలాగే ఉన్నా…
ఏదో కనిపించని మార్పు అక్కడ ఉంది.

ఆమె గుండె మెల్లగా వేగం పెంచుకుంది.

“ఇక్కడే… అతను నిలబడ్డాడు…”
అని ఆమె మనసులో అనుకుంది.

ఆమె కళ్ళు చుట్టూ తిరిగాయి…
ఎక్కడైనా అతని జాడ మళ్ళీ కనిపిస్తుందేమో అన్నట్టుగా.

కొంతమంది ప్రయాణికులు తమ పనుల్లో మునిగిపోయి ఉన్నారు.

ఎవరూ ఆమెను గమనించలేదు. కానీ హారికకు మాత్రం అందరూ తన వైపే చూస్తున్నట్టుగా అనిపించింది.

ఆమె ఆ బెంచ్ దగ్గరికి వెళ్లి…
మెల్లగా చేతితో తాకింది.

ఒక వింత అనుభూతి…
గుండెల్లో ఒక బరువు
కళ్ళలోకి ఎక్కే నీళ్లు

“అద్వైత్…” అని ఆమె మెల్లగా పలికింది.

ఆ పేరు గాలిలో కలిసిపోయింది..
ఆమె జుట్టు ముఖంపైకి వచ్చి పడింది.

ఆ క్షణం ఆమెకు అనిపించింది—
ఎవరో తన పక్కనే నిలబడి ఉన్నట్టు…

ఆమె ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసింది.
ఎవరూ లేరు.

కానీ…
ఆ ప్రదేశం ఖాళీగా అనిపించలేదు.
ఆమె గుండె గట్టిగా కొట్టుకుంటోంది.

“ఇక్కడే ఏదో జరిగింది…”
అని ఆమెకి స్పష్టంగా అనిపించింది.

అది కేవలం ఒక బస్ స్టాప్ కాదు…

ఒక రహస్యాన్ని దాచుకున్న ప్రదేశం
ఒక కథ ముగిసిన చోటు…
ఇంకో కథ మొదలయ్యే చోటు…

హారిక ఒక లోతైన ఊపిరి పీల్చుకుంది.

“నిజం తెలుసుకోవాలి…”
అని నిర్ణయించుకుంది.

అదే క్షణం…
దూరంలో ఒక బస్ హారన్ వినిపించింది…
ఆ శబ్దం ఆమెను మళ్లీ వాస్తవంలోకి తీసుకువచ్చింది.

ఆమె కళ్ళలో ఇప్పుడు భయం కాదు…
నిజాన్ని తెలుసుకునే ధైర్యం కనిపించింది.

బస్ స్టాప్ దగ్గర ఉన్న జనాలను...

“ఆ రోజు ఈ బస్‌లో ఏమైనా incident జరిగిందా?” అని అడిగింది.

మొదట ఎవరూ పట్టించుకోలేదు.
కానీ ఒక వృద్ధ డ్రైవర్ ఆమె మాట విన్నాడు.

కొద్దిసేపు ఆలోచించి…
“ఆరు నెలల క్రితం అన్నావా?” అని అడిగాడు.

“అవును…” అని హారిక గట్టిగా చెప్పింది.
ఆ డ్రైవర్ ముఖం ఒక్కసారిగా మారిపోయింది.

“ఆ రోజు… ఒక accident జరిగింది.”

హారిక గుండె ఒక్కసారిగా ఆగినట్టైంది.

“ఏం… accident?” అని అడిగింది.

“బస్ స్టాప్ దగ్గర ఒక అబ్బాయి…”

అతను మాట మధ్యలో ఆపేశాడు.

“ఒక అమ్మాయి పర్స్ పడిపోయింది… అది తీసుకుని వెళ్తున్నప్పుడు… ఒక కారు వేగంగా వచ్చి అతన్ని గుద్దింది…”
“అతను అక్కడికక్కడే…”

 మాట పూర్తి చేయకుండానే డ్రైవర్ మౌనం వహించాడు.

ఆ మాట విన్న క్షణం…

హారికకు చుట్టూ ఉన్న ప్రపంచం ఒక్కసారిగా మసకబారిపోయింది…”

హారిక కాళ్లు వణికాయి.

హారిక కళ్ళలో నీళ్లు నిండిపోయాయి.

“ఆ అబ్బాయి పేరు… ఏమిటి?” అని అడిగింది.

డ్రైవర్ మెల్లగా అన్నాడు—
“అద్వైత్.”

ఆ ఒక్క మాట…
ఆమె ప్రపంచాన్ని చీల్చేసింది.

“అయితే…
నేను ఇన్ని రోజులు మాట్లాడింది ఎవరితో…?”

ఆమె మెదడు అంగీకరించలేకపోయింది.

“అతను చనిపోయాడు అంటే… నా ముందు ఉన్నవాడు ఎవరు?”
ఆమెకి ఒక్కసారిగా ఒక విషయం గుర్తొచ్చింది—

అద్వైత్ ఎప్పుడూ:
ఫోటోలు తీసుకోనివ్వలేదు
తన ఇంటికి పిలవలేదు
గతం గురించి చెప్పలేదు

ఆ రాత్రి…
మళ్లీ 9 గంటలు.

హారిక ఈసారి భయంతో కాదు… కన్నీళ్లతో ఎదురుచూసింది.

టింగ్…

“నువ్వు సేఫ్‌గా ఉన్నావా?”

ఈసారి ఆమె వెంటనే టైప్ చేసింది—
“నువ్వు… అద్వైత్ కదా?”

కొన్ని క్షణాల నిశ్శబ్దం…
తర్వాత వచ్చిన మెసేజ్—
“ఆ రోజు… నీ పర్స్ తీసుకున్నాను.”

హారిక చేతులు వణికాయి.
“నీకు ఏమీ కాలేదని చూసుకుని… వెళ్లిపోవాలి అనుకున్నాను.”

“కానీ… వెళ్లలేకపోయాను.”

ఆమె కన్నీళ్లు జారాయి.
“నువ్వు నవ్వినప్పుడు…
నాకు మళ్లీ బ్రతకాలని అనిపించింది.”

హారిక ఏడుస్తూ టైప్ చేసింది—
“అయితే… నువ్వు ఇప్పుడు…?”

కొన్ని క్షణాల తర్వాత…

చివరి మెసేజ్ వచ్చింది—
“నేను ఇక లేను…”

“కానీ నువ్వు సేఫ్‌గా ఉన్నావో లేదో తెలుసుకోవడం…
నా అలవాటు అయిపోయింది.”

హారిక గుండె చీలిపోయింది.

“ఇక నేను వెళ్తున్నాను…”
“ఇప్పటి నుంచి… నువ్వు భయపడకుండా బ్రతుకు.”

Last Seen: 9:03 PM

ఆ రాత్రి తర్వాత…

మొదటి కొన్ని రోజులు హారిక పూర్తిగా మౌనంగా మారిపోయింది.

ఫోన్‌లో 9:00 అయ్యే సమయానికి…
ఆమె గుండె ఇంకా అదేలా కొట్టుకునేది.

“ఈరోజైనా మెసేజ్ వస్తుందా…?”
అని అనుకుంటూ… ప్రతి రోజు ఎదురు చూసేది.

కానీ…
ఆ స్క్రీన్ మౌనంగానే ఉండిపోయింది.

కొన్ని రోజులకు…
హారిక మళ్లీ ఆ బస్ స్టాప్ దగ్గరికి వెళ్లింది.

ఈసారి…
భయంతో కాదు.

ఒక ప్రశ్నకు సమాధానం చెప్పడానికి…
ఆమె నెమ్మదిగా అదే బెంచ్‌పై కూర్చుంది.

ఆకాశాన్ని చూసింది…
గాలి మెల్లగా వీచింది.

“నువ్వు నిజంగా వెళ్లిపోయావా…?” అని ఆమె మెల్లగా మనసులో అనుకుంది.

కొన్ని క్షణాలు నిశ్శబ్దం…
తర్వాత ఆమె ముఖంపై చిన్న నవ్వు వచ్చింది.

కన్నీళ్లు కళ్లలోనే ఉన్నాయి…
కానీ ఈసారి అవి బాధ వల్ల కాదు.

  • గుర్తుల వల్ల…
  • ప్రేమ వల్ల…

“నువ్వు లేకపోయినా…
నీ వల్ల నేను ఇంకా బలంగా ఉన్నాను…” అనింది.

“ఇప్పటి నుంచి… నేను భయపడకుండా బ్రతుకుతాను.”

ఆమె ఫోన్ తీసుకుంది.
చివరిసారి ఆ chat open చేసింది.

“Last Seen: 9:03 PM”

ఆమె ఒక చిన్న మెసేజ్ టైప్ చేసింది—

“Thank you…”

సెండ్ చేసింది.
అది deliver అవుతుందో లేదో ఆమెకు తెలియదు.

కానీ…
తన మనసులో ఉన్న భారాన్ని మాత్రం విడుదల చేసింది.

ఆమె నెమ్మదిగా లేచి… ముందుకు నడిచింది…
ఈసారి వెనక్కి తిరిగి చూడలేదు.

ప్రేమ ఎప్పుడూ మనతో ఉండాలంటే…
మన ముందే ఉండాల్సిన అవసరం లేదు.

కొన్ని ప్రేమలు…
మనకి ధైర్యం ఇవ్వడానికి మాత్రమే వస్తాయి.

ఆ రోజు నుంచి…
రాత్రి 9 గంటలు…
భయంకాదు…

ఒక జ్ఞాపకం అయింది.
ప్రేమ… కొన్ని సార్లు మనుషుల్ని దాటిపోతుంది.
అది ఒక నీడగా… ఒక జ్ఞాపకంగా… మనతోనే ఉంటుంది.

మీకు ఒక చిన్న ప్రశ్న…
మీరు అనుకుంటున్నారా:

అద్వైత్ నిజంగా వెళ్లిపోయాడా…?
లేక ఇంకా ఎక్కడైనా… ఆమెను చూస్తూనే ఉన్నాడా?

Comments

Popular posts from this blog

మూసిన గది రహస్యం Part 3 ముగింప

అక్కడ ఉన్న కొద్ది రోజులు గడిచిన తర్వాత… ఒక రోజు… నేను ఉతికిన బట్టలను అరేయడానికి బయటకు వచ్చాను.…  కారిడార్‌లోకి అడుగు పెట్టగానే… ఎదురుగా అద్వైత్  ఫోన్‌లో ఎవరితోనో మాట్లాడుకుంటూ నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చాడు.. మొదట నేను చూసింది నిజమో కాదో కూడా అర్థం కాలేదు… అతన్ని చూసిన క్షణం, నా చేతుల్లో ఉన్న బట్టలు కదలకుండా ఆగిపోయాయి… నా శ్వాస ఒక్కసారిగా ఆగిపోయినట్టైంది. ఎన్ని రోజుల తర్వాత… ఇంత దగ్గరగా అతన్ని చూస్తున్నాను… అతను ఫోన్ కాల్ ముగించుకుని నా వైపు చూసాడు. ఒక్క క్షణం… మా ఇద్దరి కళ్లూ కలిశాయి. అతని కళ్లలో ఆశ్చర్యం... నా కళ్లలో ఆనందం… గందరగోళం. నేను ఏమి మాట్లాడాలో తెలియక… నవ్వు కూడా సరిగా రాలేదు. చివరికి… ధైర్యం కూడబెట్టుకుని నెమ్మదిగా అన్నాను— అద్వైత్ నువ్వా…? బాగున్నావా…?  అతను కాసేపు నన్ను చూసి…   స్మైల్ చేశాడు.  నేను బాగున్నాను…  నువ్వెలా ఉన్నావు… అన్విత?  ఆ మాట విన్న క్షణం నా గుండె లోపల ఏదో కరిగిపోయినట్టైంది.  నేను కూడా బాగున్నాను…  ఎన్ని రోజులయ్యింది నిన్ను చూసి…  అని చెప్పేటప్పుడు… నా గొంతులో చిన్న కంపనం వినిపించింది. అలా మేము ఇద్దరం కా...

Part-3 తలుపు బయట ఉన్నది నా ఫ్రెండ్ కాదు… అయితే ఎవరు? తలుపు తానే తెరుచుకుంది… తర్వాత ఏమైంది?

  అర్ధరాత్రి వచ్చిన కాల్ – Part 3 (Final) “అర్ధరాత్రి వచ్చిన ఆ కాల్‌ని రవి ignore చేసి ఉండాల్సింది…  ఎందుకంటే ఆ ఒక్క కాల్ వాళ్ల జీవితాన్ని పూర్తిగా మార్చేసింది.  ఆ రాత్రి వాళ్లు చూసింది మనిషి కాదు… కానీ అది వాళ్ల రూపంలోనే ఉంది.” తలుపు బయట నిలబడి ఉన్న ఆ నీడను చూసిన క్షణంలోనే… అరుణ్ చేతిలో ఉన్న ఫోన్ నేలపై జారిపోయింది. టార్చ్ వెలుతురు నెమ్మదిగా ఆ నీడ ముఖం మీద పడింది. రవి శ్వాస ఆగిపోయినట్టయింది. ఎందుకంటే… బయట నిలబడి ఉన్నది అతడే. అదే ముఖం… అదే కళ్ళు… అదే బట్టలు… కానీ ఒక తేడా ఉంది. ఆ “రవి” ముఖంపై అసహజమైన చిరునవ్వు ఉంది. అతని మెడ కొంచం పక్కకు తిరిగి ఉంది… కళ్ళు మాత్రం ఒక్కసారి కూడా మూయడం లేదు. అప్పుడే బయట నిలబడి ఉన్న ఆ రూపం నెమ్మదిగా మాట్లాడింది— కిరణ్  తలుపు తెరువు…   లోపల ఉన్నది నిజమైన రవి కాదు.”  ఆ మాట విన్న వెంటనే గదిలో భయంకరమైన నిశ్శబ్దం అలుముకుంది. లోపల నిలబడి ఉన్న రవి ఒక్కసారిగా వెనక్కి అడుగు వేసాడు. అరుణ్ మాత్రం చెమటలు పట్టిన చేతులతో టార్చ్‌ను గట్టిగా పట్టుకున్నాడు.  ఇది… ఇదే నేను చూసింది…” అరుణ్ గొంతు వణికింది.  ముందు నా వాయిస్‌ని కాపీ చేసింది… ...

పెద్దింటి రహస్యం – Part 2” ఈ ఇంట్లో కోడళ్లు ఎందుకు చనిపోతారు? నిజం బయటపడిన రాత్రి…”

ఆమె గుండె బలంగా కొట్టుకుంటోంది.  కొత్త కోడలు కూడా బలి అవుతుంది.  ఆ ఒక్క వాక్యం ఆమె మెదడులో మళ్లీ మళ్లీ మారుమోగుతోంది. ఆమె ఒక్కసారిగా తేరుకుని పుస్తకాన్ని మళ్లీ తీసుకుంది. అందులో ఇంకొన్ని పేజీలు వేగంగా తిప్పింది. మొదటి పేజీ నుంచి చదవడం ప్రారంభించింది. అప్పుడు తనకు అర్థం అయ్యింది. అందులో ఒక పాత కథ ఉంది అందులోని ఒకొక్క పేజీని చదువుతూ వచ్చింది. నాదియాకు దొరికిన పుస్తకం సాధారణమైన పుస్తకం కాదు. అది ఆ ఇంటి మొదట బలి అయిన కోడలు రాసినది. ఆ పుస్తకంలో మొదట పేజీ ఇలా ఉంది ఈ పుస్తకం చదువుతున్నావంటే నువ్వు ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నవో నాకు అర్థం అయ్యింది. దీనికి ఇక ముగింపు ఇవ్వాలని, ఈ పుస్తకం నీకు సహాయం కోసం రాస్తున్నాను. నా పేరు — “అమృత” ఏళ్ల క్రితం ఈ పెద్దింటి పూర్వీకులు చాలా పేదవాళ్లు. వాళ్లు రోజూ కష్టపడి పని చేసినా... తినడానికి సరిపడా అన్నం కూడా దొరకేది కాదు. పగలు పొలాల్లో పని చేస్తూ, రాత్రిపూట తినడానికి తిండి లేకుండా ఆకలితోనే నిద్రపోయేవారు. పిల్లలు రోజంతా ఏడుస్తూ ఉంటే పెద్దలు అసహాయంగా చూస్తూ కాలాన్ని గడిపేవారు. ఆ ఇంట్లో నవ్వులు ఎప్పుడో మాయం అయ్యాయి.  ఒకసారి భారీ కరువు వచ్చింది....

Episode - 3 ఉమ్మడి కుటుంబం1980లో మట్టి కుండలోని ఆనందం

ఉమ్మడి కుటుంబం – Episode 3 మధ్యాహ్నపు ఎండ నెమ్మదిగా ఊరంతా పరుచుకుంది. ఇళ్ల ముందు వేసిన మగ్గాలపై ఆరేసిన బట్టలు గాలికి మెల్లగా ఊగుతున్నాయి. దూరంగా ఎక్కడో ఎద్దుల బండి చక్రాల శబ్దం వినిపిస్తోంది. సుమతి ఇంటి ముందు నిలబడి,  శారదా… రామ్మా తల్లి… అన్నం చల్లారిపోతుంది…” అంటూ మళ్లీ పిలిచింది. పిల్లలతో ఆడుకుంటున్న శారద,  వస్తున్నా అమ్మా…” అంటూ పరుగెత్తుకుంటూ వచ్చింది. పాదాలన్నీ మట్టితో నిండిపోయి ఉన్నాయి. అది చూసి సుమతి,  అయ్యో… నిన్ను చూస్తే పిల్లలా ఉన్నావో లేక మట్టిబొమ్మలా ఉన్నావో అర్థం కావట్లేదు!” అంది. శారద చిన్నగా నవ్వేసింది. ఇంట్లోకి వెళ్లగానే రాములమ్మ అప్పటికే పళ్లెంలు తీసి వరుసగా పెట్టింది. ఆ రోజుల్లో భోజనం అంటే అందరూ కలిసి కూర్చుని తినడం తప్పనిసరి. ముందు ఇంటి పెద్దవాళ్లు… తర్వాత పిల్లలు…చివరగా ఆడవాళ్లు తినేవారు. సుమతి మావయ్య సిద్దయ్య ఇంకా రాఘవుడు ఇద్దరూ పొలం నుంచి భోజనానికి అని కొద్దిసేపు ఇంటికి వచ్చారు.  నాన్నా...  తాతయ్యా..." అంటూ వాళ్ళ దగ్గరకు పరిగెత్తింది శారద. అంతలో తాతయ్య చేతులు, కాళ్ళు కడుక్కుని "రామ్మా నా చిట్టి తల్లి" అంటూ శారదను ఎత్తుకున్నాడు. రాఘవుడు...