"ఖజానా రహస్యం”
పాలమూరు జిల్లాలోని రామాపురం అనే ఒక చిన్న గ్రామం ఉండేది. పచ్చని పంట పొలాల మధ్యలో, కొండల నీడలో నిద్రిస్తున్నట్టుగా కనిపించే ఆ గ్రామం. ఉదయం సూర్యుడు ఉదయిస్తే కోయిలల కుహుకుహూ ధ్వనులతో మేల్కొంటుంది. సాయంత్రం అయితే ఆకాశం ఎరుపు రంగులో మెరిసిపోతూ, గాలిలో పచ్చని నేల వాసన గ్రామం మొత్తం పరుచుకుంటుంది.
అక్కడి జీవితం చాలా సరళంగా సాగుతుంది. పెద్దలు ఒక పెద్ద చెట్టు కింద కూర్చుని మాట్లాడుతూ పాతకాలపు కథలు చెప్పుకుంటూ కాలం గడుపుతారు. పిల్లలు ఆడుకుంటూ నవ్వుల సందడి చేస్తారు. ఇలా ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ఆ గ్రామానికి ఒక రహస్యపు నీడ కూడా ఉంది.
అప్పట్లో ఆ గ్రామం చివర్లో ఉన్న అడవి అంచున ఒక పాత కోట ఉండేది… ఆ కోట రాజుల కాలంనాటిది. కాలం దెబ్బకి గోడలు పాడైపోయింది, కానీ దాని రూపం మాత్రం ఇంకా భయానకంగా కనిపిస్తుంది. రాత్రి పడితే ఆ కోట చుట్టూ గాలి కూడా వింతగా ఊదుతూ, ఎవరో నిశ్శబ్దంగా కబుర్లు చెప్పినట్టుగా అనిపిస్తుంది.
ఆ గ్రామంలో వీర అనే ఒక ధైర్యమైన అబ్బాయి ఉంటాడు. చిన్నప్పటి నుండి తాతయ్య చెప్పిన రాజుల కథలు వింటూ పెరిగిన వీర, ఒక రోజు ఏదైనా నిజమైన రహస్యాన్ని కనుక్కోవాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నాడు. అలా అతనికి పురాతన కథలు, రహస్యాలు అంటే చాలా ఇష్టం. ఒక రోజు వీరకు తన తాతయ్య గదిలో ఉన్న పాత పుస్తకాల మధ్య ఒక చిన్ని మ్యాప్ దొరికింది. ఆ మ్యాప్ మీద కోట చిత్రంతో పాటు కొన్ని గూఢ సంకేతాలు కూడా ఉన్నాయి. చివర్లో లోపలికి వెళ్లేవారు… తిరిగి రావడం అరుదు…" దాని తర్వాత ఇంకో వాక్యం కూడా ఉంది…
"సత్యసంధుడైనవాడికే ఖజానా లభ్యం.
వీర దాన్ని చూసి ఎలాగైనా దీని గురించి మరిన్ని విషయాలను తెలుసుకోవాలని చాలా ఉత్సాహపడ్డాడు. ఈ విషయాన్ని తన స్నేహితురాలైన మాధవితో పంచుకున్నాడు. తర్వాత ఇద్దరూ కలిసి ఎంత కష్టమైన కోటకు వెళ్లాలని మాట్లాడుకొన్నారు. మరుసటి రోజు ఉదయమే సిద్దమై, ఇద్దరూ కలిసి ఆ కోటకు బయలుదేరారు. ఎలాగో కోట దగ్గరికి చేరుకున్నారు.
కోట లోపలికి అడుగుపెట్టగానే చుట్టూ గాఢమైన చీకటి అలుముకుంది. గోడలపై ఎక్కడ చూసిన పాత చిత్రాలు కనిపిస్తున్నాయి. ఆ పాత చిత్రాల కళ్ళు… వారినే వెంబడిస్తున్నట్టు అనిపించాయి… గోడల మధ్య నుంచి చల్లని గాలి గట్టిగా వీచింది… ఆ గాలి శబ్దం చాలా భయానాకంగా వినిపిస్తుంది. అలాంటి శబ్దంలో ఎవరో నిదానంగా మాట్లాడుతున్నట్టుగా వినిపించింది. మాధవి ఒక్కసారిగా ఆగిపోయింది.
“వీరా… వినిపించిందా? ఎవరో మన వెనకాల నడుస్తున్నట్టు, ఏవో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది…” అని భయంతో చెప్పింది. వీర గుండె కూడా వేగంగా కొట్టుకుంటోంది… కానీ బయటకి మాత్రం చూపించకుండా, “ఏమీ కాదు… గాలి శబ్దమే… మనం ధైర్యంగా ఉండాలి” అని అన్నాడు.
అలా వారు కొంచెం ముందుకు వెళ్లారు. నడుస్తున్నప్పుడు వీర తొందరలో ఒక రాయిని నొక్కాడు. నొక్కగానే… పై నుంచి ధూళి కురిసింది… దాంతో గది మొత్తం కంపించింది. అక్కడ నేలపై వేసే వారి అడుగుల “టక్… టక్… టక్…” ప్రతిధ్వని కోటంతా మారుమోగింది… ఒక మూలన పాత తలుపు నెమ్మదిగా “క్రీక్…” అంటూ కదిలింది! అది చూసి మాధవి భయంతో వీర చేతిని గట్టిగా పట్టుకుంది.
“ఇక్కడ నిజంగానే ఏదో ఉంది వీరా…” అని అంది ఆమె మెల్లగా. కానీ వీర ధైర్యం కోల్పోలేదు. “మనం ఇక్కడికి వచ్చిందే రహస్యాన్ని తెలుసుకోవడానికి… వెనక్కి వెళ్లడం అసాధ్యం!” అని ధైర్యంగా ముందుకు అడుగేశాడు వీర. అలా వారు గుండెల్లో భయం ఉన్నా… అడుగులు ఆగకుండా ముందుకు సాగారు. మ్యాప్‌లో చూపినట్టు ఒక పెద్ద రాయి దగ్గరకు వచ్చి ఆగారు. వీర చుట్టూ గమనిస్తున్నాడు.
మాధవి ఆ రాయి మీద మూడు గుర్తులు ఉండటం గమనించింది .
"సూర్యుడు, చంద్రుడు, తాళం చెవి."
కాసేపు ఆ గుర్తులను జాగ్రత్తగా చూసింది.
“వీరా… ఇక్కడ ఏవో సంకేతాలుగా అనిపిస్తున్నాయి కానీ ఏవి అర్థం కావడం లేదు చూడు" అని చెప్పింది. వీర వెంటనే దగ్గరగా వెళ్లి చూసాడు.
“హ్మ్… సూర్యుడు, చంద్రుడు… ఇవి సాధారణంగా కనిపిస్తున్నాయి కానీ ఏదో సంభంధం ఉండాలి…” అని ఆలోచించాడు. మాధవి మెల్లగా అంది, “సూర్యుడు అంటే పగలు… చంద్రుడు అంటే రాత్రి… అంటే ఇది సమయానికి సంబంధించినదేమో?”
వీర తల ఊపుతూ, “అవును… కానీ తాళం చెవి ఎందుకు ఉంది? కేవలం పగలు, రాత్రి అంటే సరిపోదు…” అన్నాడు. ఇద్దరూ కాసేపు నిశ్శబ్దంగా ఆలోచించారు… అప్పుడే వీరకి ఒక ఆలోచన వచ్చింది!
“ఓహ్! అర్థమైంది అనుకుంటా…” అని ఉత్సాహంగా అన్నాడు. మాధవి ఆశ్చర్యంగా చూసింది.
“ఏమైంది?”
వీర చెప్పాడు, “సూర్యుడు → పగలు, చంద్రుడు → రాత్రి" అంటే ఈ రహస్యం రాత్రి సమయంలోనే తెరుచుకుంటుంది ఇక "తాళం చెవి అంటే — ఒక రహస్య ద్వారం!” అని అనిపిస్తుంది అన్నాడు కొంచం సందేహంతో. మాధవి కళ్లలో ఆశ్చర్యం మెరిసింది.
“అంటే… మనం రాత్రి వరకు వేచి ఉండాలా?” వీర ధైర్యంగా నవ్వుతూ, “అవును… అదొక్కటే మార్గం చూద్దాం!” అన్నాడు. ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని… ఆ రహస్యాన్ని తెలుసుకోవడానికి రాత్రి వరకు అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నారు. ఆకాశంలో మేఘాలు పక్కకు జరగగా… చంద్రుడు నెమ్మదిగా వెలుగునిచ్చాడు…
చంద్రుడు పూర్తిగా పైకి రాగానే ఆ రాయి పక్కన ఉన్న ఒక గోడ తనంతటతానే నెమ్మదిగా తెరుచుకుంది! ఇద్దరూ ఉలిక్కిపడ్డారు. తర్వాత నిధనంగా చూశారు. దాని లోపల ఒక చిన్న గది కనిపించింది. మెల్లగా లోపలికి వెళ్లారు. ఆ గదిలోకి అడుగుపెట్టగానే బంగారు నాణేలు వెలుగులో మెరుస్తున్నాయి… అక్కడ వాళ్లకు ఒక స్వరం వినిపించింది… ‘ఈ ఖజానా కోసం వచ్చినవారు చాలామంది… కానీ అర్హులు కొంత మంది మాత్రమే…’
అక్కడ పాత రాజుల ఆభరణాలు పెద్ద పెద్ద బంగారు విగ్రహాలు కళ్లుచెదిరేలా కనిపించాయి…దాన్ని చూసి వారిద్దరూ చాలా ఆనందపడ్డారు. కానీ అక్కడ ఒక పలకపై “ఈ ఖజానా గ్రామాభివృద్ధి కోసం మాత్రమే. స్వార్థం కోసం కాదు” అని రాసి ఉంది.
దాన్ని చూసిన వీర, మాధవి ఇద్దరూ ఒకరినొకరు చూసి నవ్వుకుని ఆ రోజు అక్కడే ఉంది మరుసటి రోజు తెల్లారక ఉదయమే అక్కడినుండి బయటకువెళ్లారు.
ఇద్దరి ఇంట్లో వారు కంగారుపడుతుంటారు. అప్పుడే వీర ఇంకా మాధవి ఇద్దరూ వారి ముందుకు వచ్చారు. అక్కడున్న గ్రామ ప్రజలందరినీ పిలిచి జరిగిన విషయం మొత్తం చెప్పి ఖజానాను గ్రామ పెద్దలకు అప్పగించారు.
అంత గొప్ప సాహసం చేసిన వీర ఇంకా మాధవి ఇద్దరినీ ఊరి ప్రజలు పొగిడారు, అభినందించారు. ఆ ఖజానాతో గ్రామ పెద్దలు పాఠశాల, ఆసుపత్రి నిర్మించారు. దానితో గ్రామం అభివృద్ధి చెందింది.
అది చూసి రామాపురం ప్రజలు “నిజాయితీ, ధైర్యం ఉంటేనే నిజమైన ఖజానా లభిస్తుంది” అని చెప్పుకుంటున్నారు: ఆ రోజు నుండి గ్రామంలోని పిల్లల కళ్ళల్లో కొత్త కలలు మెరిశాయి…
నీతి: స్వార్థం కన్నా సమాజ సేవ గొప్పది.
మనకు దొరికే ప్రతి అవకాశం మనకోసమే కాదు… సమాజం కోసం కూడా ఉపయోగపడాలి. వీర, మాధవి చేతుల్లో అపారమైన ఖజానా వచ్చినప్పటికీ, వారు స్వార్థాన్ని ఎంచుకోలేదు. తమ సుఖం కోసం దాన్ని దాచుకోకుండా, గ్రామం అభివృద్ధి కోసం వినియోగించారు. అదే నిజమైన గొప్పతనం. ధైర్యం ఉండటం ఒక్కటే సరిపోదు… ఆ ధైర్యాన్ని మంచి పనులకు ఉపయోగించడం చాలా ముఖ్యము. వారి నిర్ణయం వల్ల ఒక గ్రామం మారింది…
పిల్లలకు చదువు వచ్చింది, రోగులకు చికిత్స అందింది, ప్రజల జీవితం మెరుగైంది. ఇది మనకు చెబుతున్న సందేశం ఏమిటంటే
స్వార్థం తాత్కాలిక సంతోషం ఇస్తుంది, కానీ సమాజ సేవ శాశ్వత గౌరవాన్ని ఇస్తుంది. మన దగ్గర ఉన్నది చిన్నదైనా సరే… మనసు పెద్దదైతే అది ఎన్నో జీవితాలను మార్చగలదు.
ఇలాంటి మరిన్ని stories 👇
Episode 1 చెరువు దగ్గర కనిపించిన అమ్మాయి | Telugu Suspense Story 👉 Click here

Comments
Post a Comment