Skip to main content

Episode - 11 ఉమ్మడి కుటుంబం| సుమతి అడుగు – కొత్త ఆశకు నాంది

"వరద వారి పంటను తీసుకెళ్లింది...   అప్పులు వారి నిద్రను దోచుకున్నాయి...   కానీ ఒక చిన్న ఆశ వారి జీవితాన్ని మళ్లీ మార్చబోతోంది.  ఆ ఆశకు మొదటి అడుగు వేసింది సుమతే..." సుమతి అడుగు – కొత్త ఆశకు నాంది సుమతి మాటలు విన్న తర్వాత అక్కడ కొద్దిసేపు నిశ్శబ్దం నెలకొంది. సిద్ధయ్య ఆమె వైపు చూసి మెల్లగా అన్నాడు.  అమ్మా... నీ మనసు ఎంత మంచిదో మాకు తెలుసు. కానీ పొలం పని నిజంగా చాలా కష్టం.  సుమతి మాత్రం వెనక్కి తగ్గలేదు.  మావయ్యా...  మొదట్లో కష్టం అనిపించొచ్చు. కానీ నేర్చుకుంటాను. కుటుంబం కోసం చేసే పని కదా. ఆమె మాటల్లో కనిపించిన నమ్మకం అందరినీ ఆలోచనలో పడేసింది. చివరికి రాములమ్మ చిరునవ్వుతో అంది. "సరే అమ్మా...  నీ ఇష్టం. కానీ ఎక్కువ కష్టపడకూడదు." ఆ మాట విన్న సుమతి ముఖంలో చాలా రోజుల తర్వాత నిజమైన ఆనందం కనిపించింది. మరుసటి రోజు ఉదయం సూర్యుడు ఉదయించకముందే సుమతి లేచింది. ఇంటి పనులు త్వరగా ముగించి సిద్ధయ్యతో కలిసి పొలానికి వెళ్లింది. పొలంలో అడుగుపెట్టగానే ఆమెకు కొత్త ప్రపంచంలోకి వచ్చినట్టుగా అనిపించింది. ఎక్కడ చూసినా తడిసిన నేల... వరద మిగిల్చిన గుర్తులు... ఎండిపో...

Episode-3 చెరువు దగ్గర కనిపించిన అమ్మాయి 1980లో జరిగిన భయంకరమైన రహస్యం

చెరువు దగ్గర కనిపించిన అమ్మాయి – Part 3

1980ల్లో…
ఆ ఊరిలో పౌర్ణమి రాత్రి పేరు వినగానే కూడా
కొంతమంది పెద్దవాళ్లు మౌనంగా మారిపోవడానికి కారణం ఉంది. చెరువు దగ్గర కనిపించే ఆ అమ్మాయి నిజంగా ఆత్మేనా…?
లేక…
ఎన్నేళ్లుగా దాచిపెట్టిన ఒక నేరం తిరిగి బయటకు రావాలనుకుంటుందా…?

ఇంటి ముందు కనిపించిన ఆ తడిసిన పాదాల గుర్తులను చూసి రాఘవ గుండె బలంగా కొట్టుకుంటోంది.

మట్టిలో స్పష్టంగా కనిపిస్తున్న ఆ అడుగుల గుర్తులు
ఆ ముద్రలు ఒక్కోటి ఎంతో భారంగా నేలపై పడినట్టుగా కనిపించాయి. చెరువు మట్టి ఇంకా తడిగా ఉండటంతో ఆ కాళ్ల ఆకారాలు స్పష్టంగా బయటపడ్డాయి. పాదాల చుట్టూ చిన్న చిన్న నీటి బిందువులు మెరుస్తున్నాయి. అవి కేవలం అడుగుల గుర్తుల్లా కాకుండా, ఇప్పుడే ఎవరో అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చి ఇంటి వెనుక ఆగినట్టుగా అనిపించాయి.

చన్నయ్య చేతిలో ఉన్న పాత కర్ర మెల్లగా వణికింది.
అతని నుదుటిపై చెమట చుక్కలు మెరుస్తున్నాయి. గదిలో వేలాడుతున్న చిన్న నూనె దీపం గాలికి ఊగుతూ గోడలపై భయంకరమైన నీడలను చూపించింది. రాఘవ గొంతు ఎండిపోయింది. అతను ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేక అక్కడే నిలబడి ఆ అడుగుల వైపు చూస్తూ ఉన్నాడు. 
చప్ప్… చప్ప్... ఆ శబ్దం మళ్లీ వినిపించింది.  ఈసారి మరింత దగ్గరగా. మట్టిలో తడిసిన కాళ్లు నెమ్మదిగా ఈడ్చుకుంటూ వస్తున్నట్టుగా. ఇంటి వెనకాల ఉన్న ఎండిపోయిన ఆకులు కూడా ఆ అడుగుల తాకిడికి మెల్లగా కదిలాయి. రాఘవ చేతులపై రోమాలు నిక్కబొడుచుకున్నాయి. చన్నయ్య మాత్రం తలుపు వైపు చూస్తూనే ఉన్నాడు. అతని కళ్ళలో కనిపిస్తున్న భయం  ఏదో చాలా ఏళ్లుగా దాచిపెట్టిన రహస్యం మళ్లీ బయటికి వస్తోందన్నట్టుగా ఉంది. ఇంటి బయట ఉన్న చెట్టు కొమ్మలు
గాలికి ఊగుతూ కిటికీ అద్దాన్ని మెల్లగా తాకుతున్నాయి.
టక్… టక్…

అది చిన్న శబ్దం అయినా కూడా
ఆ నిశ్శబ్ద రాత్రిలో భయంకరంగా వినిపించింది. దూరంగా చెరువు వైపు నుంచి కప్పల అరుపులు వినిపిస్తున్నాయి. ఆ అరుపుల మధ్యలో మట్టిమీద నీళ్లు కారుతున్న శబ్దం మాత్రం ఇంకా స్పష్టంగా వినిపిస్తూనే ఉంది. రాఘవ గుండెలో ఒక్కసారిగా చల్లని వణుకు పరిగెత్తింది. వాన చినుకులు ఇంకా పైకప్పు మీద బలంగా పడుతూనే ఉన్నాయి. దూరంగా మెరుపు మెరుస్తే ఆ గోదాం ఆకారం కాసేపు స్పష్టంగా కనిపించి మళ్లీ చీకటిలో కలిసిపోతుంది. చన్నయ్య మాత్రం తలుపు దగ్గర నిలబడి వణికిపోతున్నాడు.

అతని కళ్ళు ఆ పాదాల గుర్తుల మీదే నిలిచిపోయాయి. “నేను చిన్నప్పటి నుంచే ఆ గోదాం గురించి ఎన్నో మాటలు విన్నాను రాఘవా” అంటూ అతని గొంతు కొంచంగా కంపించింది. “రాత్రి అయ్యాక అక్కడ నుంచి ఎవరో నడిచే శబ్దాలు వినిపిస్తాయని, ఖాళీగా ఉన్న గోదాంలో దీపం వెలిగినట్టు కనిపిస్తుందని, కానీ దగ్గరికి వెళ్లి చూసే సరికి ఏమీ ఉండదని చెప్పేవారు…”

రాఘవ మాత్రం ఆ తడిసిన అడుగుల గుర్తులను జాగ్రత్తగా గమనిస్తున్నాడు. మట్టిలో స్పష్టంగా పడిన ఆ అడుగులు చూస్తే ఎవరో ఇప్పుడే అక్కడికి నడిచి వెళ్లినట్టే ఉన్నాయి. గాలి ఒకేసారి బలంగా వీచింది. ఇంటి వెనుక ఉన్న కొబ్బరి చెట్లు గట్టిగా ఊగిపోయాయి. ఆ శబ్దం మధ్యలో ఎక్కడినుంచో చాలా మెల్లగా ఒక తలుపు చిరుచిరు మంటూ కదిలినట్టుగా వినిపించింది.

రాఘవ నెమ్మదిగా వెనక్కి తిరిగి చన్నయ్య వైపు చూశాడు.
“నువ్వు విన్నావా…?” చన్నయ్య ముఖం పూర్తిగా వెలిసిపోయింది. అతని పెదవులు వణుకుతున్నాయి. “అది... అదే శబ్దం…” అని అతను మెల్లగా అన్నాడు. “ఆ రాత్రి కూడా… లక్ష్మి కనిపించకుండా పోయే ముందు ఇదే శబ్దం విన్నామని ఊరి వాళ్లు చెప్పారు” ఆ మాటలు వినగానే చుట్టూ ఉన్న చీకటి ఇంకా భారంగా అనిపించింది.

వాన వాసనతో కలిసిన పాత మట్టి వాసన గాలిలో ఒక విచిత్రమైన చలిని పుట్టిస్తోంది. రాఘవ కళ్ళు మళ్లీ ఆ గోదాం వైపు వెళ్లాయి. చీకటిలో నిశ్శబ్దంగా నిలబడి ఉన్న ఆ పాత గోదాం ఎవరినో ఎదురు చూస్తున్నట్టుగా కనిపిస్తోంది. రాఘవ శ్వాస బిగుసుకుంది. ఆకాశంలో మరోసారి మెరుపు మెరిసింది. ఆ తెల్లటి వెలుగు క్షణం పాటు మొత్తం గోదాం చుట్టూ పరచుకుంది. కొన్ని క్షణాలు ఆ గోదాం తలుపు స్పష్టంగా కనిపించింది.

అది పాత కలప తలుపు ఏళ్ల తరబడి ఎవరూ తాకనట్టుగా పగుళ్లు పడిపోయాయి. చెక్కల మధ్య నుంచి నల్లటి తేమ బయటికి కనిపిస్తోంది. పైన తుప్పు పట్టిన తాళం వాన నీళ్లు పడుతూ ఉండటంతో ఆ తాళం మీద నుంచి ఎర్రటి తుప్పు చుక్కలు కిందికి జారుతున్నాయి. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తలుపు కింద నుంచి నీళ్లు బయటికి కారుతున్నాయి. అవి సాధారణ వర్షపు నీళ్లలా కనిపించలేదు. చీకట్లో కూడా అవి అసహజంగా నల్లగా మెరుస్తున్నాయి. నీళ్లు నెమ్మదిగా నేల మీద పాకుతూ రాఘవ కాళ్ల దగ్గరికి వచ్చి చేరుకున్నాయి. ఆ చల్లదనం తాకగానే రాఘవ గుండె బలంగా కొట్టుకుంది.

రాఘవ నెమ్మదిగా ముందుకు నడిచాడు. ప్రతి అడుగుతో గాలి మరింత చల్లబడుతోంది. గోదాం చుట్టూ ఉన్న చెట్లు కూడా ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయాయి. కొద్ది సేపటి క్రితం వినిపించిన గాలి శబ్దం కూడా ఇప్పుడు ఆగిపోయినట్టుంది. ఇక అక్కడ మిగిలింది మాత్రం... వాన చినుకులు పడుతున్న శబ్దం, తలుపు కింద నుంచి కారుతున్న నీటి చుక్కలు, ఇంకా గట్టిగా వినిపిస్తున్న రాఘవ శ్వాస. చన్నయ్య వెనక నుంచి గట్టిగా అన్నాడు.

“ఆ తలుపు తీయకూడదు రాఘవా…!
ఆ రోజు మేము చేసిన తప్పే చాలు…”
ఆ మాటల్లో భయం మాత్రమే కాదు. ఏళ్లుగా దాచుకున్న బాధ కూడా స్పష్టంగా వినిపించింది. రాఘవ ఒక్కసారిగా ఆగిపోయాడు. “మేమా?” అని మెల్లగా అడిగాడు. ఆ ఒక్క మాట విన్న వెంటనే చన్నయ్య చేతులు స్వల్పంగా వణికాయి. చన్నయ్య కళ్ళు మూసుకున్నాడు. అతని ముఖం మొత్తం పశ్చాత్తాపంతో నిండిపోయింది. గడ్డం మీద వాన చినుకులు జారుతున్నాయా, లేక చెమటో రాఘవకి అర్థం కాలేదు. కొన్ని క్షణాలు ఎవరూ మాట్లాడలేదు.

ఆ నిశ్శబ్దంలో దూరంగా ఎక్కడో పిడుగు గర్జించింది. చన్నయ్య మెల్లగా తలదించుకున్నాడు. అతని పెదాలు కదిలాయి. కానీ మాటలు మాత్రం బయటికి రాలేదు. రాఘవకు ఒక్క విషయం మాత్రం స్పష్టంగా అర్థమైంది. ఈ గోదాం గురించి ఇప్పటివరకు తాను విన్న కథలన్నింటికంటే ఇంకా చాలా భయంకరమైన నిజం బయటపడాల్సి ఉంది.

"ఆ రాత్రి లక్ష్మి ఒంటరిగా లేదు” అని చన్నయ్య చెబుతుంటే, రాఘవ గుండె ఒకేసారి బలంగా కొట్టుకుంది.  
“అంటే?” అన్నాడు. 
చన్నయ్య గొంతు వణికింది.
 
“ఆమె ఏదో చూసింది రాఘవా…
ఈ ఊరు ఎప్పటికీ బయటకు రాకూడదనుకున్న ఒక విషయం…” గాలి ఒకేసారి చిల్చుకుంటూ వీచింది. అదే సమయంలో గోదాం లోపల నుంచి ఎవరో మెల్లగా ఏడుస్తున్నట్టుగా శబ్దం వినిపించింది. రాఘవ శరీరం మొత్తం చల్లబడిపోయింది.

గోదాం లోపల దాగి ఉన్న నిజం ఏమిటి...?
లక్ష్మి చూసిన రహస్యం అసలు ఏమిటి...?
చన్నయ్య దాచిపెట్టిన నిజం బయటపడుతుందా...?

Part 4 లో తెలుసుకుందాం...

ఈ కథ యొక్క తర్వాతి భాగం త్వరలో వస్తుంది… 
పూర్తి కథను మిస్ కాకుండా follow అవ్వండి.
part - 4 👉 Click Here

Comments