"వరద వారి పంటను తీసుకెళ్లింది... అప్పులు వారి నిద్రను దోచుకున్నాయి... కానీ ఒక చిన్న ఆశ వారి జీవితాన్ని మళ్లీ మార్చబోతోంది. ఆ ఆశకు మొదటి అడుగు వేసింది సుమతే..." సుమతి అడుగు – కొత్త ఆశకు నాంది సుమతి మాటలు విన్న తర్వాత అక్కడ కొద్దిసేపు నిశ్శబ్దం నెలకొంది. సిద్ధయ్య ఆమె వైపు చూసి మెల్లగా అన్నాడు. అమ్మా... నీ మనసు ఎంత మంచిదో మాకు తెలుసు. కానీ పొలం పని నిజంగా చాలా కష్టం. సుమతి మాత్రం వెనక్కి తగ్గలేదు. మావయ్యా... మొదట్లో కష్టం అనిపించొచ్చు. కానీ నేర్చుకుంటాను. కుటుంబం కోసం చేసే పని కదా. ఆమె మాటల్లో కనిపించిన నమ్మకం అందరినీ ఆలోచనలో పడేసింది. చివరికి రాములమ్మ చిరునవ్వుతో అంది. "సరే అమ్మా... నీ ఇష్టం. కానీ ఎక్కువ కష్టపడకూడదు." ఆ మాట విన్న సుమతి ముఖంలో చాలా రోజుల తర్వాత నిజమైన ఆనందం కనిపించింది. మరుసటి రోజు ఉదయం సూర్యుడు ఉదయించకముందే సుమతి లేచింది. ఇంటి పనులు త్వరగా ముగించి సిద్ధయ్యతో కలిసి పొలానికి వెళ్లింది. పొలంలో అడుగుపెట్టగానే ఆమెకు కొత్త ప్రపంచంలోకి వచ్చినట్టుగా అనిపించింది. ఎక్కడ చూసినా తడిసిన నేల... వరద మిగిల్చిన గుర్తులు... ఎండిపో...
“1980లో… ఒక చిన్న పల్లెలో జరిగిన సాధారణ సంఘటన… ఏళ్ల తర్వాత కూడా ఆ ఊరి వాళ్లు మర్చిపోలేకపోయారు. ఆ కథ మొదలైంది మాత్రం… ఒక చిన్నారి చేతిలో ఉన్న మట్టి కుండ దగ్గర నుంచే…”
తర్వాత భాగం👇
శారద మళ్లీ తన చిన్న కుండను నీళ్లలో ముంచింది. ఈసారి మాత్రం జాగ్రత్తగా రెండు చేతులతో పట్టుకుంది. కొంచెం నీళ్లు కుండలో నిండగానే… ఆమె ముఖం ఆనందంతో మెరిసిపోయింది. అమ్మా చూడు… నింపేశా!” అంటూ గట్టిగా అరిచింది. అక్కడున్న ఆడవాళ్లు నవ్వుకుంటూ, అయ్యో… మన శారద ఇప్పుడు పెద్దమ్మాయి అయిపోయిందే!” అన్నారు. శారద సిగ్గుపడుతూ అమ్మ వెనకాల దాక్కుంది. అప్పుడే కాలువ పక్కన కూర్చున్న పెద్దావిడ వెంకటమ్మ మాట్లాడుతూ, సుమతి… ఈ ఏడాది వానలు బాగున్నాయి. పంట కూడా బాగుంటుందేమో!” అంది.
సుమతి నీళ్లు కుండలో నింపుకుంటూ, దేవుడు దయ చేస్తే అప్పులు కొంచెం తీరతాయి పెద్దమ్మ…” అంది నెమ్మదిగా. ఆ మాట విన్న దగ్గరున్న వాళ్లు ఒక్కసారి మౌనంగా అయ్యారు. ఆ రోజుల్లో రైతు జీవితమంటే అలానే ఉండేది. వానలు బాగా పడితే పంట బాగుంటుంది. లేకపోతే ఏడాది మొత్తం కష్టమే. ఇంతలో కాలువ పక్కనే ఉన్న పిల్లలు మట్టితో చిన్న చిన్న బొమ్మలు చేస్తున్నారు. శారద కూడా వాళ్ల దగ్గరకు వెళ్లి కూర్చుంది. ఇది మా ఇల్లు…” అంటూ మట్టితో చిన్న గోడ కట్టింది. ఇది మా ఆవు…” అంటూ పక్కనే ఇంకో మట్టి ముద్ద పెట్టింది. పిల్లల ఊహల్లో ఆ చిన్న మట్టి ప్రపంచమే నిజమైన రాజ్యం.
సుమతి నీళ్లు నింపేసి, “శారద… వెళదామా?” అని పిలిచింది. కానీ శారద మాత్రం, “ఇంకొంచెం సేపు ఆడుకుంటా అమ్మా…” అంది మొహం చిట్లిస్తూ. ఇంటికి వెళ్లాక మీ నాన్న పొలానికి వెళ్లాలి. నాకు ఇంకా చాలా పనులున్నాయి.” అంది సుమతి. అంతే… శారద తన చిన్న కుండను మళ్లీ ఎత్తుకుంది. తిరుగు దారిలో సూర్యుడు కొంచెం పైకి ఎక్కాడు. మట్టిదారిపై చెట్ల నీడలు పడుతున్నాయి. దారిమధ్యలో ఒక బండిపై ఇద్దరు రైతులు వరి సంచులు తీసుకెళ్తున్నారు.
ఎద్దులు నెమ్మదిగా నడుస్తుంటే… వాటి మెడల్లో ఉన్న గంటలు టన్… టన్… అంటూ మోగుతున్నాయి. శారద ఆ శబ్దం విని ఆనందంగా, “అమ్మా… మన ఎద్దులకీ ఇలా గంటలు కడదాం!” అంది. సుమతి నవ్వుతూ, ముందు మనవి పంట కోత దాకా బలంగా ఉండాలి కదమ్మా!” అంది. ఇంటికి చేరేసరికి సుమతి అత్త అయిన రాములమ్మ బయట మగ్గం దగ్గర కూర్చుని పాత చీర అల్లుతోంది. ఇంత సేపా?” అంది కాస్త గట్టిగా. పాప కూడా వచ్చింది కదా అమ్మా… అందుకే కొంచం ఆలస్యమైంది.” అంది సుమతి. రాములమ్మ శారద చేతిలో ఉన్న చిన్న కుండ చూసి నవ్వుకుంది. అయ్యయ్యో… మన చిన్నమ్మ కూడా ఇప్పుడు నీళ్లు తెస్తుందా?” అంది. శారద గర్వంగా తల ఊపింది.
ఆ రోజులలో ఇళ్లన్నీ దాదాపు ఉమ్మడి కుటుంబాలే. ఒకే ఇంట్లో తాతలు... అమ్మమ్మలు… అన్నదమ్ములు… వారి పిల్లలు… అందరూ కలిసి ఉండేవారు. ఇంటి మధ్యలో పెద్ద మేడ. ఒక మూలలో ధాన్యం బస్తాలు. మరొక వైపు ఆవుల కొట్టు. వంట మాత్రం ఒకటే. పెద్ద గిన్నెల్లో అన్నం వండేవారు. మధ్యాహ్నం అయ్యేసరికి అందరూ నేలమీద వరుసగా కూర్చుని కలిసి తినేవారు. వీళ్ళ ఇంట్లో ఇద్దరు పెద్దవాళ్ళు అత్తయ్య - మావయ్య, సుమతి - సుమతి భర్త ఇంకా వాళ్ళ కూతురు శారద. శారద ఒక్కతే కూతురు అయినందుకు తనని అల్లారు ముద్దుగా చూసుకొనేవారు. శారద ఇంట్లో ఉంటే చాలు ఇల్లంతా సందడిగా ఉండేది. సుమతి భర్త పొలానికి వెళ్ళడానికి సిద్ధం అవుతున్నాడు. అంతలో ఇంటి ముందున్న చిన్న మట్టిమేడ మీద కుండలు వరుసగా పెట్టింది సుమతి ఇంకా శారద. కొత్తగా తెచ్చిన నీళ్ల చల్లదనం ఇంకా వాటి మీద కనిపిస్తూనే ఉంది. అప్పుడే లోపల నుంచి రాఘవుడు బయటికి వచ్చాడు. పొలానికి వెళ్లేందుకు… తెల్లని పంచె కట్టుకుని, భుజాన గొడ్డలి వేసుకుని, చేతిలో చిన్న తాడు పట్టుకుని నడుస్తూ వచ్చాడు.
ఇంటిముందు నిలబడి కుండలను చూసి, నీళ్లు తెచ్చావా?” అని అడిగాడు. సుమతి చెమటను చీరకొంగుతో తుడుచుకుంటూ నవ్వింది. తెచ్చా… కానీ ఈరోజు నీ కూతురు కూడా పెద్ద పని చేసింది.” అంది. రాఘవుడు ఆశ్చర్యంగా శారద వైపు చూసాడు. అయ్యో… ఏం చేసింది మన బుజ్జి?” అని అడిగాడు.
అంతే… శారద వెంటనే ఇంటి మూలన పెట్టిన తన చిన్న మట్టి కుండ దగ్గరకు పరుగెత్తింది. రెండు చేతులతో ఆ చిన్న కుండను ఎత్తుకుని చూపిస్తూ, నేనే నీళ్లు తెచ్చా!” అంది గర్వంగా. ఆ చిన్న ముఖంలో కనిపించిన ఆనందం చూసి… రాఘవుడు పెద్దగా నవ్వేశాడు. అయ్యో అయ్యో… ఇక నాకు సహాయం చేసే వాళ్లు పెరిగిపోయారే!” అంటూ ఆమెను చేతుల్లోకి ఎత్తుకున్నాడు. శారద నవ్వుతూ తండ్రి మెడ పట్టుకుంది. నేను పెద్దయ్యాక నీతో పొలానికి కూడా వస్తా!” అంది అమాయకంగా. అలానా? మరి నాకు అన్నం కూడా తెస్తావా?” అన్నాడు రాఘవుడు సరదాగా. వెంటనే హుమ్ తెస్తా!” అంది శారద. మరి అమ్మను ఎవరు చూసుకుంటారు?” అని అడిగితే శారద కాసేపు ఆలోచించి, అమ్మ కూడా మనతో వస్తుంది!” అను చెప్పింది. ఆ మాట విన్న సుమతి నవ్వకుండా ఉండలేకపోయింది.
అలా ఆ రోజు… ఆ చిన్న ఇంట్లో నవ్వులు, మాటలు, ఆప్యాయతలతో ఒక ప్రత్యేకమైన ఆనందం నిండిపోయింది. కొద్దిసేపటికే సుమతి పొయ్యి మీద పెట్టిన పెద్ద గిన్నెలో నీళ్లు బాగా వేడయ్యాయి. ఆవిరి నెమ్మదిగా పైకి ఎగిరిపోతూ ఉండగా… సుమతి శారదను దగ్గరకు పిలిచింది. సరే చిట్టితల్లి… నీళ్లు వేడి అయ్యాయి. ఇక పద, నీకు స్నానం చేయిస్తా.” అంది ముద్దుగా. శారద చిన్నగా నవ్వుతూ పరుగెత్తుకుంటూ వచ్చింది. చల్లని నీళ్లు పోయొద్దమ్మా…” అంది ముందుగానే భయపడుతూ. అయ్యో… మా బంగారానికి చల్లని నీళ్లు పోస్తానా?” అంటూ సుమతి నవ్వింది.
ఇంటి వెనుక చిన్న మట్టిమేడ దగ్గర పెద్ద బిందెలో వేడి నీళ్లు పోసి, కొద్దిగా చల్లని నీళ్లు కలిపింది.
చేత్తో నీళ్ల వేడి చూసి, ఇప్పుడు బాగున్నాయి…” మెల్లగా చెప్పింది. శారదను చిన్న పీట మీద కూర్చోబెట్టి నెమ్మదిగా స్నానం చేయించడం మొదలుపెట్టింది. కళ్ళు మూసుకోమ్మా…” అని చెప్పగానే శారద రెండు చేతులతో ముఖం కప్పుకుంది. సుమతి ఆమె తలపై నీళ్లు పోస్తూ, అయ్యో… ఎంత పెద్దమ్మాయైపోయిందో మా చిట్టితల్లి…” అంటూ ప్రేమగా సరదాగా మాట్లాడుతూ స్నానం చేయించింది. స్నానం అయిపోయాక… లోపలికి తీసుకెళ్లి చెక్క పెట్టెలో మడతపెట్టి పెట్టిన మంచి బట్టలు తీసింది. పసుపు రంగు చిన్న లంగా, ఎరుపు జాకెట్ వేసింది.
తర్వాత జుట్టు నెమ్మదిగా దువ్వి, రెండు చక్కని జడలు వేసింది. జడల చివర ఎర్రటి రిబ్బన్లు కట్టింది. శారద అద్దం ముందు నిలబడి తనను తాను చూసుకుంటూ నవ్వుకుంది. అది చూసిన సుమతి గుండె నిండిపోయింది. ముఖానికి చిన్న నల్ల బొట్టు పెట్టి, ఇప్పుడు చూడు మా చిట్టితల్లి ఎలా మెరుస్తోందో…” అంటూ చెంపపై చిన్న దృష్టి చుక్క కూడా పెట్టింది. ఎందుకమ్మా ఇది?” అని శారద అడిగితే మా బంగారాన్ని ఎవరి దృష్టి తగలకుండా ఉండాలని…” అంది సుమతి. శారదకు అది పూర్తిగా అర్థం కాకపోయినా... అమ్మ ప్రేమ మాత్రం బాగా అర్థమైంది. ఇక్కడే కూర్చోమ్మా… కదలొద్దు” అని చెప్పి సుమతి లోపలికి వెళ్లింది.
కొద్దిసేపటికి ఒక చిన్న గిన్నెలో వేడి వేడి అన్నం, పప్పు, కొద్దిగా నెయ్యి కలుపుకుని వచ్చింది. శారద ముందు కూర్చుని చిన్న ముద్దలు చేస్తూ తినిపించడం మొదలుపెట్టింది. ఒకప్పుడు ఒక చిన్న పిట్ట ఉండేదట…” అంటూ కథ కూడా చెప్పసాగింది. కథ వింటూ శారద కళ్ళు పెద్దవిగా చేసుకుంది. అమ్మా… ఆ పిట్ట ఎక్కడికి వెళ్లింది?” అంటూ మధ్య మధ్యలో అడుగుతోంది. ముందు ముద్ద తిను… తర్వాత చెబుతా…” అంటూ సుమతి నవ్వింది.
ఆ చిన్న ఇంట్లో… పొయ్యి మీద మరిగే కూర వాసన, బయట నుంచి వినిపించే పక్షుల అరుపులు, అమ్మ కూతుళ్ల నవ్వులు… అన్నీ కలిసి ఒక ప్రశాంతమైన ఉదయాన్ని మరింత అందంగా మార్చేశాయి. తినిపించడం పూర్తయ్యాక సుమతి ఆమె చేతులు కడిగి, సరే తల్లి… ఇక నువ్వు బయటికి వెళ్లి ఆడుకో. నేను వంట చేస్తా.” అంది. దూరంగా వెళ్లను అమ్మా…” అంటూ శారద బయటికి పరుగెత్తింది. సుమతి కూడా నవ్వుకుంటూ తిరిగి పొయ్యి దగ్గరకు వెళ్లింది. ఊరి పిల్లలంతా పెద్ద చెట్టు కింద చేరుకున్నారు. కొందరు గిల్లి దండా ఆడుతున్నారు. మరికొందరు గోళీలు ఆడుతున్నారు. ఆడపిల్లలు మాత్రం చెయ్యి పట్టుకుని చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతున్నారు. ఆ కాలంలో ఆటలంటే నిజంగా ఆటలే… ఫోన్లు… టీవీలు… ఏమీ లేని రోజులవి.
అలా శారద పిల్లలతో ఆడుకుంటూ ఉండగా… సుమతి తన ఇంటి పనులంతా ముగించి శారద దగ్గరకు వచ్చింది. ప్రేమగా, శారదా రామ్మా… భోజనం తిందువు…” అంటూ దగ్గరకు వచ్చింది సుమతి.
కానీ… ఆ రోజు మధ్యాహ్నం వాళ్ల ఇంటి ముందుకు వచ్చిన ఒక వ్యక్తి. ఆ కుటుంబ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాడని అప్పుడు ఎవరికీ తెలియదు…
తర్వాత ఏమి జరిగిందో తెలుసుకోవడానికి మమ్మల్ని Fallow అవ్వండి.
Episode - 3 త్వరలో వస్తుంది
Click Here👉 Part - 3

Comments
Post a Comment